Saturday, 31 January 2015

గ్యాస్ట్రిక్ ట్రబుల్ (గ్యాస్ ట్రబుల్) (Gastric Trouble)

  • మొదట 100 గ్రాములు వామును దోరగా వేయించి పిండికొట్టి జల్లించి పక్కన పెట్టుకోవాలి. తరువాత 100 గ్రాములు పటిక బెల్లం నూరి పొడి చేసుకోవాలి. తరువాత 100 గ్రాములు ఆవు నెయ్యిని కరిగించి అందులో పొడిచేసిన వామును మరియు పటిక బెల్లం పొడిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలియబెట్టాలి. తరువాత దీనిని చల్లారిస్తే చిక్కటి లేహ్యం తయారవుతుంది. దీనిని శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకొని రోజూ భోజనానికి గంట ముందుగాని లేదా భోజనానికి తరువాత గాని సేవిస్తే కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది.
  • ఒక గ్రాము అల్లం తీసుకొని దాన్ని చిటికెడు ఉప్పుతో కలిపి రోజు రెండు పూటలా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.
  • వాము నాలుగు భాగాలు, శోంటి రెండు భాగాలు, నల్ల ఉప్పు ఒక భాగం, శంఖ భస్మం ఒక భాగం అన్నింటిని కలిపి రోజు ఒక కప్పు వేడి నీటిలో అర చెంచా పొడిని కలిపి తీసుకుంటుంటే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
  • త్రిఫలా చూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల పొడి ) మరియు త్రికటు చూర్ణం (మిరియాలు, పిప్పళ్ళు, శొంటి పొడి) రెండింటి చూర్ణాలను కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకొని రోజు ఒక గ్లాసు నీటిలో అర చెంచా చూర్ణం కలిపి కషాయం లాగా కాచి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది.
  • ధనియాలు, శొంటి సమపాళ్ళలో తీసుకుని నీళ్ళలో వేసి కాచి వడగట్టి అరకప్పు చొప్పున రెండుపూటలా భోజనానికి ముందు  తీసుకుంటే గ్యాస్ తో పాటు అజీర్తి కూడా తగ్గిపోతుంది.
  • కరక్కాయ పెచ్చుల చూర్ణం, పిప్పళ్ళు, సౌవర్చ లవణం మూడు సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా పొడిచేసి అన్నింటికీ కలిపి నిల్వచేసుకుని రోజు అరచెంచా చొప్పున వేడినీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • శొంటి పొడి మరియు బెల్లం రెండు సమపాళ్ళలో కలిపి మూడు పూటలా అరచెంచా చొప్పున తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
  • కరక్కాయ పెచ్చుల చూర్ణం పటిక బెల్లం సమపాళ్ళలో కలిపి రోజూ రెండు పూటలా బోజనానికి ముందు తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


తీసుకోకూడనివి:-  టీ, కాఫీ, ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్, చిక్కుడు, ఆపిల్, ఉల్లి పాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, శనగ పిండి వంటకాలు, గ్రుడ్డు, వేరుశనగ వీటన్నింటిని చాలా వరకు తగ్గించాలి లేదా తీవ్రతను బట్టి పూర్తిగా మానెయ్యాలి.

Friday, 30 January 2015

ఏరండ తైలం (ఆముదపు చెట్టు తైలం) (castor oil plant)

మోకాళ్ళ నొప్పులు:-

ఆముదపు చెట్టు వేర్లను 1 కేజీ తీసుకొని నలుగకొట్టి దానికి నాలుగు కేజీల  నీటిని పోసి పొయ్యి మీద మరగనివ్వాలి. నీరు 1 కేజీ వచ్చేంత వరకూ మరగనిచ్చి తీసి వడపోయాలి. వడపోయగా వచ్చిన కషాయానికి 1 కేజీ ఆముదం కలిపి మళ్ళీ సన్నని మంటపై మరగనివ్వాలి. ఈ కషాయం అంతా ఇగిరి 1 కేజీ అయ్యేంత వరకూ మరగనివ్వాలి. తరువాత దించి వడగట్టి చల్లార్చి పెట్టుకోవాలి. దీనిని గోరువెచ్చగా వేడిచేసి నొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఇలా రోజు చేయడం వలన నొప్పి శాశ్వతంగా తగ్గిపోతుంది.


ఆముదము చెట్టు

ఉత్తరేణి తైలం (LATJEERA)

ఉత్తరేణి (Latjeera) ఆకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. వాటిని మెత్తగా నూరి రసం తీసి వడగట్టి పెట్టుకోవాలి. ఇలా వడగట్టిన ఉత్తరేణి రసాన్ని ఒక కప్పు తీసుకొని ఒక కప్పు నువ్వుల నూనె కలిపి సన్నని మంటపై మరిగించాలి. రసం అంతా ఇగిరి నూనె మాత్రం మిగిలే వరకూ మరగనివ్వాలి.  ఇలా తయారైన రసాన్ని రోజూ ఉదయం స్నానానికి ఒక గంట ముందు పొట్టపై మర్దన చేయడం వలన అధిక పొట్ట తగ్గటమే కాకుండా చర్మ సంబంధ వ్యాధులు కూడా నివారించాబడతాయి.